శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు
నా చిన్నతనంలో రేడియోలో భక్తిరంజని లో “ఏమి సేతురా లింగా”, “పాహి రామప్రభో” అంటూ పాడే శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి విలక్షణమైన గొంతు వినిపించేది. ఆ పాటల గొప్పతనం కానీ, ఆ గాయకుని ప్రతిభను గురించి ఎంత మాత్రం అవగాహన లేని ఆ వయసులో కూడా ఆ గాత్ర మాధుర్యం నన్ను వెన్నాడుతూనే ఉండేది. నాలో ఆయన పట్ల అభిమానాన్ని ప్రోది చేసినవాడు ఒక రకంగా మా నాన్నే. ఆయన సంగీత ప్రతిభ కన్నా ఆయన సృజనాత్మకత, ఆత్మ విశ్వాసం, ఏటికి ఎదురీదే స్వభావం గురించి ఎంతో ఉద్వేగంతో నాన్న పదే పదే చెప్పిన మాటలు పూర్తిగా నా చిన్న బుర్రకి అర్థము అయ్యేవి కావు, కానీ ఆయన అంటే ఇష్టం ఏర్పడిపోయింది, ఎందుకంటే నాన్నకు ఆయన అంటే చాలా ఇష్టం అని. అయితే ఎదుగుతున్నకొద్దీ, ఆయన పాటలు తరుచుగా వినకపోయినా, విన్న ప్రతిసారీ ఆ గొంతు పట్ల ఆరాధన పెరుగుతూ వచ్చింది.
కాకినాడ వచ్చేశాక, సంగీత సౌరభాలు ముమ్మరంగా ఆఘ్రాణించే సమయాలు ఎక్కువై, ఆ గళంలోని విశిష్టత నెమ్మదిగా తెలియవచ్చింది. దసరా గాన సభలలో ప్రత్యక్షముగా ఆ పుంభాను సరస్వతి గానవిన్యాసం కని ఆనందమో, విభ్రాంతో తెలియని స్థితిలో, ఇంట్లో ఆయన పాటల గురించి ఏదో సందర్భంలో అమ్మమ్మ, అమ్మ,పిన్ని అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటుంటే, నాకూ పెద్ద ఏదో తెలిసినట్టుగా తాపత్రయపడి మాటలు కలిపి పోజులు కొట్టేదాన్ని. వాళ్లందరికీ సంగీతంలో ప్రవేశం ఉంది కనక, దీనికి ఏం తెలుసనీ అలా మాట్లాడుతోందని అక్షింతలు పడేవి. పైగా నేను సంగీతం నేర్చుకోలేదు కూడానూ.
అప్పట్లో దొరికే వ్యాసాలు, సమీక్షలు, చదివిన తర్వాత ఆయన ఘనతను అర్థం చేసుకోవడానికి నాకు తగిన జ్ఞానం లేదు అని అర్థం అయ్యింది. ఆయన పట్ల అభిమానం ఆకాశమంత ఎత్తున పెరిగిపోయే స్థాయికి వచ్చేను. దీనికి కారణం దసరాలల్లో సరస్వతి గానసభలో ఆయన కచ్చేరీలకి వెళ్లే అదృష్టం కలిగినందుకు. ఆయన గానంలో ఏదో సమ్మోహన శక్తి ఉంది కనుకనే, ఇప్పటికీ ఆ కచ్చేరీలను తలుచుకుంటే వొళ్ళు పులకరిస్తుంది.
ముంబైలో ఆయన కచేరీకి నన్ను, మా అమ్మని , మావారిని మా పెద్దబ్బాయి తీసుకెళ్లాడు 2012 లో. ఆయనకు అప్పటికే 80 సంవత్సరాలు దాటాయి. ఆ కచేరీలో ఆయనను ప్రతక్ష్యంగా కలిసి మాట్లాడే భాగ్యం కలిగింది మా ఇంట్లో మూడు తరాలవాళ్ళకి. కొద్ది సేపే అయినా ఆయన చాలా బాగా మాట్లాడేరు. మా పెద్దబ్బాయికి ఆయనంటే విపరీతమైన అభిమానం. ఆయన పాటలు వింటూనే పెరిగాడు. ఆయన పాటల గురించి ఎంతో విషయం సేకరణ చేసాడు. ఎన్నో కొత్త పాటలను అంటే నేను వినని వాటిని సమాచారం ఇచ్చి వాటి అర్థాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వయసులో చిన్నవాడైనా ఈ విషయంలో నాకు మార్గదర్శి.
శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి గురించి రాయడం అంటే హిమాలయ పర్వతాన్ని ఒక చిన్న అద్దంలో చూపించడం వంటిది . సంగీతంలో ఓనమాలు తెలియని నేను అలాటి ప్రయత్నం చెయ్యడం ఒక విధముగా దుస్సాహసమే. అయినా ఆయనపట్ల నాకున్న అభిమానంతోనే దానికి వడికట్టాను, దానిని మీరంతా సహృదయంతో అర్థం చేసుకుంటారనే నమ్మకంతో. ఈ నా రచనకి ముఖ్యప్రేరకుడు అయిన మా పెద్దబ్బాయికి ప్రేమాశీస్సులతో. రేపు నా రచన తో మీ ముందు ఉంటాను
సంగీతం అనేది ప్రపంచ భాష. దానికి దేశకాలాలు, ఎల్లలు, జాతి, మత, లింగ బేధాలు లేవు.
వస్తుతః సంగీతం ఒక దైవదత్తమైన కళ. వంశీమోహనుడి వేణుగాన మాధురికి సమస్త ప్రకృతి మంత్రముగ్ధమైనట్టే, ఆయన పాటలోని వశీకరణశక్తికి మనము దాసోహం అనక తప్పదు. కోనసీమ కమనీయతను, గోదావరి గలగలల సంగీతాన్ని విదేశాలలో వ్యాపింపచేసి తెలుగువారి కీర్తి బావుటాను, విశ్వమంతటా ఎగురవేసిన మా గోదావరి బయకారుడు ఆయన. నారద విరచితమైన ‘స్వరార్ణవం’ని చేతబట్టుకునే ఆయన పుట్టారని జనశ్రుతి. ఆ మహా సంగీతకారుడు ఎవరో ఈ పాటికి మీరు గ్రహించే ఉంటారు. అవునండి! ఆయనే “శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు.”
ఆయన పుట్టిన వూరు తూర్పుగోదావరి జిల్లా, రాజోలు మండలంలోని శంకరగుప్తం. స్థల పురాణకథను అనుసరించి ఒకసారి శంకరుడు తాను ఇచ్చిన వరాల దుష్ప్రభావాన్ని తప్పించుకోడానికై ఈ వూరులో కొన్నాళ్ళు వసించేడని తెలుస్తోంది. సామవేద గానమూర్తి శంకరుడి పాదస్పర్శతో పునీతమైన వూరిలో పుట్టిన ఆయనకు, ఆ ముక్కంటి అనుగ్రహం లభించిడములో ఆశ్చర్యం లేదు. సంగీతం నాకు రాదు, తెలియదు. కానీ, సంగీతానికి నేను తెలుసు. అందుకే, అది నన్ను వెతుక్కుంటూ వచ్చినంత కాలం నేను వాహికగా మాత్రం ఉంటాను. పాట నా నోట పలుకుతుంది” అని తరుచుగా చెప్పే ఆయన, త్యాగరాజస్వామివారి ప్రత్యక్ష శిష్యపరంపరలో అయిదోతరం వారసుడు. త్యాగరాజస్వామివారికి మానాంబు చావిడి (ఆకుమళ్ళ) వెంకట సుబ్బయ్య గారు , ఆయనకు సుసర్ల దక్షిణామూర్తిశాస్త్రి గారు, సుసర్ల వారికి పారుపల్లి రామకృష్ణయ్య గారు, ఆయనకు బాలమురళీకృష్ణ గారు – ఇదీ ఆ శిష్యపరంపర.
ఆయన తల్లి శ్రీమతి సూర్యకాంతమ్మగారు ప్రసిద్ధ వాగ్గేయకారులు శ్రీ ప్రయాగ రంగదాసు గారి కుమార్తె, వైణికురాలు. తండ్రి శ్రీ పట్టాభిరామయ్యగారు గాయకులు, వాయులీన, వేణుగాన విద్వాంసులు. జన్మతః ప్రాప్తించిన సంగీతం నరనరాన ప్రవహించే ఆయన, పుట్టిన పదిహేను రోజులకే తల్లిని కోల్పోయి అమ్మవొడి వెచ్చదనం, పసితనపు ముద్దుమురిపాలు, ఆటపాటలు, అల్లరులు, గోరుముద్దలు, అలరిపులకి నోచుకోలేదు. అందుకేనేమో సంగీత సరస్వతి నాలుగు చేతులతోనూ ఆయనని తన హృదయానికి హత్తుకుని, అవాజ్యమైన ప్రేమతో సంగీతక్షీరధారలు కురిపించి, ఆయన గళానికి చిరంజీవత్వాన్ని కలిగిస్తే, తన గానమాధుర్యముతో ఆయన ఆ వాగ్దేవికే పులకలు పుట్టించిన పుంభావ సరస్వతి. బాలవితంతువైన పెత్తల్లి సుబ్బమ్మగారి పెంపకంలో పెరిగిన ఆయనకు నామకరణం జరగనేలేదు. మగపిల్లవాడు పుడితే ‘మురళీకృష్ణ’ అని పేరు పెట్టాలని తల్లిదండ్రులు అనుకున్నందున, అందరూ అలానే పిలిచేవారు. చిరుత వయసులోనే పక్కవాద్యాలతో సహా సంగీత గోష్ఠి నెరపిన ఆ అసాధారణ ప్రతిభామూర్తి ప్రజ్ఞకు మురిసిపోయిన సుప్రసిద్ధ హరికథకులు శ్రీ ముసునూరి సూర్యనారాయణ భాగవతార్ గారు ఆయన పేరులో ‘బాల’ అనే మాట చేర్చి,‘బాల మురళీకృష్ణ’గా దీవించారు. ఆ పేరుతోనే ఆయన జగద్విఖ్యాతులు. ఈ తరంవారి పూర్వజన్మ సుకృతం వల్లనే కర్ణాటక సంగీత వాగ్గేయకారులలో శ్రీ బాలమురళీ కృష్ణగారిని ప్రత్యక్షంగా చూసే భాగ్యం ఎందరికో దక్కింది. మా ఇంట్లోనే దాదాపు అయిదు తరాలకి ఆయన సంగీతంతో పరిచయం.
గాయకుల శైలితోనూ, వారియొక్క కళాపాటవంతోనూ మన పరిచయం పెరిగేకొద్దీ, మనం ఆనందించే స్థాయి కూడా పెరుగుతుంది అనే నా నమ్మకం.
“సంగీతం అంటే ప్రాణం, జీవం. అదే మనిషి జీవితం. అంతే తప్ప, సంగీతం అంటే ఏవో నాలుగైదు కీర్తనలు పాడడం కాదు” అని ఎంతో గాఢంగా నమ్మిన బాలమురళీకృష్ణగారు జీవితాంతం అదే పూనికతో నడిచారు, తన జీవితాన్ని నడిపించుకున్నారు. వారి ఎనభై ఏళ్ల సుదీర్ఘ రాగ ప్రస్థానం కర్ణాటక సంగీత శాస్త్రీయ చరిత్రలో చెరగని ఒక భవ్యమైన నవ్యపుట. సంప్రదాయము అంటే కేవలం తాము నేర్చుకున్న విద్యను, ఎటువంటి మార్పులకు తావివ్వకుండా, యధావిధిగా ముందు తరాలకి అందజేయడం అనే నిర్వచనానికి మంగళం పాడి, సంపన్నసంప్రదాయస్ఫూర్తిని పదిలంగా కాపాడుకుంటూ, కాలానుగుణమైన మార్పులతో కర్ణాటక సంగీతాన్ని రాబోయే తరాలకి అందచేయడం ద్వారానే జీవిస్తుంది అని త్రికరణశుద్ధిగా నమ్మి, దానిని మనసా వాచా ఆచరించినందునే ఆయన గుంపులో గోవిందుడులా మిగిలిపోక, సంగీతవిహాయసమున వన్నె తరగని ధృవతారలా తళుక్కుమన్నారు.
సంప్రదాయపు ఇనుపచట్రాలలో ఉక్కిరిబిక్కిరి అవుతూ సామాన్యులకు చేరువకాలేకపోతున్న కర్ణాటక సంగీతపు మూలప్రకృతిని ఎంతమాత్రమూ విఘాతపరచకుండా, పండితపామర మనోరంజక సాధనముగా మలచడానికి ఆయన ఎక్కని మెట్లు లేవు, దాటని అగడ్తలు లేవు, ఎదుర్కోని సవాళ్ళు లేవు. దూషణభూషణలను ఒకేలా స్వీకరించి, మొక్కవోని ఆత్మబలంతో తాను అనుకున్నది సాధించి, రసజ్ఞులను సంగీతపు సాగరంలో నిండరా మునకలు వేయించి, అవధులు లేని ఆనందంతో, తన్మయత్వంతో తూరీయవస్థకి చేరేలా చేసిన అపర సంగీత శంకరుడు. సంగీత ప్రపంచాన ఆయనొక నిరంతర సంచారి, అద్భుత సాహసి. స్వీయప్రతిభతో, రచనావైదుష్యంతో, కర్ణాటక సంగీతాన్ని, “బాలమురళికి ముందు, బాలమురళికి తరువాత” అన్నంతగా ప్రభావితం చేసిన ఈ తరపు వాగ్గేయకారులు ఆయన.
పాడడం ఎంతో కష్టం అని పేరుపడ్డ కర్ణాటక సంగీత కృతుల స్వరస్థానాల్ని రమ్యంగా రూపొందించి, అతులిత మాధుర్యంతో అలవోకగా పాడే ఆయన శైలి, అవే కృతులను పాడిన, పాడుతున్న ఇతరులతో పోల్చినప్పుడు చాలా విలక్షణంగా, జనరంజకంగా ఉంటుంది. నిరంతర సంగీతసాధన, మధనం మూలంగాను, వాగ్గేయకారుల కీర్తనలలోని మూల తాత్విక తత్త్వాన్నిసమగ్రంగా ఆకళింపు చేసుకోవడం మూలంగాను ఆయన దృక్పథం సంకుచితపు పొరలను చీల్చుకుని విశాలమవుతూ వచ్చింది. ఎటువంటి భేషజాలు లేకుండా, పిన్నపెద్ద తారతమ్యం లేకుండా, ప్రతిభను ఎక్కడ ఉన్నా గుర్తించి, అభినందించి, పట్టం కట్టే ఉదారులు, సుమనస్కులు ఆయన. ఆయన వల్ల ఇంతోఅంతో ప్రభావితం కాని సంగీతకారులను వ్రేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.
సంగీతానికి ముఖ్య లక్షణాలు సంప్రదాయమే కాదు, మనసు, మేధ కూడా అని భావించిన ఆయన మనోధర్మ పద్ధతిలో ఎన్నో అపూర్వమైన స్వర గమక కల్పనలను చేశారు. ‘ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకొనే మాటల్లో కూడా సంగీతం ఉంటుంది. కాని ఆ సంగీతం సరిగ్గా కుదరకపోతే, ఒకరు మాట్లాడేది మరొకరికి అర్థం కాదు. అదే సంగీతం సమశ్రుతిలో ఉంటే, బ్రహ్మానందపరుస్తుంది” అనే మనోధర్మ సంగీతజ్ఞుడు బాలమురళీకృష్ణగారు, సంగీతంలో స్పృశించని ప్రక్రియ లేదు, చేయని ప్రయోగం లేదు. అది శాస్త్రీయ సంగీతం కానివ్వండి, భక్తి సంగీతం కానివ్వండి, సినిమా సంగీతం కానివ్వండి, లలిత సంగీతం కానివ్వండి, జానపద సంగీతం సంగీతం కానివ్వండి, పరభాషా సంగీతం కానివ్వండి ఏదైనా సరే.
ఆయన గళంలో ఠీవి, శ్రుతి, ఆత్మవిశ్వాసం, దేనికదే తమదే పైచేయి అన్నట్టుగా, ఒకదానితో ఒకటి పోటీపడుతూ ఉంటాయి. ఆయన గొంతులో వొదిగిన గమకాలు, రేరాజు చూపులకి పులకించి కులుకుతున్న కలువపూల కదలికలంత సుతారంగా ఉండి, వయ్యారపు పోకడలు పోతూ, మనలను మోహ పారవశ్యంలో ముంచుతాయి. అపారమైన విద్వత్తుకి సైదోడుగా కించిత్ ధిషణాహంకారం ఆయనకు అలంకారంగానే భాసిల్లింది. గాత్ర సంగీతంలోనే కాకుండా, ఆయన వాద్య సంగీతంలో వయొలిన్, వయోలా, మృదంగం, వీణ, కంజీరా, వేణువు, హార్మోనియం, గోటువాద్యం మొదలైన అనేక వాద్యాలలో అభిరుచితో పాటు అభినివేశం కూడా ఉన్న బహుముఖ ప్రజ్ఞావంతులు. లయ విన్యాసంలో ఆయన నందీశ్వరుడుకి సాటి రాగలవారు. నారదాంశతో జన్మించిన ఆయన, వీణావాదనలో మేటి అయిన తన తల్లి పాటవానికి గురుతుగా, చెన్నైలోని తమ ఇంటికి నారదుడి వీణ “మహతి” పేరు పెట్టుకున్నారు.
ఆయనకు బెజవాడ అనబడే విజయవాడతో అవినాభావ సంబంధం ఉంది. ఆయన బాల్యం, చదువు, సంగీత సాధన, తొలి కచేరీలకి బెజవాడే వేదిక. ప్రభుత్వ సంగీత కళాశాలకు మొట్టమొదటి ప్రధానోపాధ్యాయుడిగా, ఆలిండియా రేడియో సంగీత సంచాలకునిగా ఇతోధిక సేవలను అందించింది ఇక్కడే. చెన్నైలో స్థిరపడినా, ఖండఖండాంతరాలలో సంగీతం ద్వారా ఖ్యాతి పొందినా, విజయవాడలోని సత్యనారాయణపురంలో “సూర్యకాంత భవనం” అని తన తల్లి పేరు పెట్టుకున్నఇంటిని ఇంకా అట్టేపెట్టుకోవడం, ఆ వూరిపైన ఆయనకున్న మమకారానికి తార్కాణం. విజయవాడ పురపాలక సంఘంవారు ఆయన గౌరవార్ధం, ఆయన ఇల్లు వున్న వీధికి “మంగళంపల్లి వీధి” అని పేరు పెట్టారు.
నిజమైన కళకు ఎటువంటి హద్దులు, సరిహద్దులు, భాషాబేధాలు లేవని నిరూపించిన ఆయన దేశవిదేశాలలో సుమారు 25వేలకు పైగా కచేరీలు చేసి శ్రోతలను రంజింపచేశారు. బెంగాలీ భాషలో పాడిన 28 రవీంద్ర గీతాలు, ఉత్తరాది సంగీత మేరుశిఖరాలైన భీమ్‌సేన్ జోషి, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, గానవిదుషీమణి కిశోరీ అమోన్‌కర్, తదితరులతో నిర్వహించిన జుగల్‌బందీలు ఆయన కీర్తికిరీటాలలో కలికితురాయిలు. ఆయన అందుకోని సన్మానాలు, ఆయనను వరింపని బిరుదులు లేవు, లేవు. “సంగీత కళానిధి”, “గానకౌస్తుభ”, “గానకళాభూషణ”, “గాన గంధర్వ”, “గాయక శిఖామణి”, “జ్ఞాన శిఖామణి”, “నాదజ్యోతి”, “సంగీత కళాసరస్వతి”, “నాద మహర్షి”, “గంధర్వ గాన సామ్రాట్”, “జ్ఞానసాగర”, “పద్మవిభూషణ్” ఇత్యాదులు మచ్చుకి కొన్ని. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయనకు శాశ్వత ఆస్థాన సంగీత విద్వాంసులుగా అరుదైన గుర్తింపునిచ్చింది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి తొలి ఆస్థాన విద్వాంసుడిగా, శ్రీశైలం మల్లిఖార్జునుడి ఆస్థాన విద్వాంసుడిగా ఆయన ఎన్నో సేవలందించి తరించారు.
ఆయన ప్రాధమిక విద్యాభ్యాసం అర్ధాంతరంగా ముగిసినా, సంస్కృతాంధ్రభాషల్లో మంచి పట్టు సాధించి వివిధ విశ్వవిద్యాలయాల నుంచి 12 డాక్టరేట్లు అందుకొన్న విద్యావంతులు. సంగీతస్రష్ట, ద్రష్ట, గాయకుడు,వాద్యకారుడు, స్వరకర్త,సాహితీవేత్త, సంగీతదర్శకుడు, నటుడు, అన్నిటిని మించి నిత్యయవ్వనుడు-ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతలు మూర్తిమంతమైన మహానుభావుడు శ్రీ బాలమురళీకృష్ణగారు. ‘మహతి’,‘లవంగి’,‘సుముఖం’,‘సర్వశ్రీ’, ‘గణపతి’,‘ప్రతి మధ్యమావతి’, ‘సిద్ధి’ అనే సరికొత్త రాగాలను దాదాపు 25కు పైగా శ్రీ బాలమురళీకృష్ణ సంగీత ప్రపంచానికి పరిచయం చేశారు. ఆయన స్వదస్తూరితో ముద్రితమైన ‘సూర్యక్రాంతి’ గ్రంథం భవిష్యత్తరాలకు చక్కని రాజమార్గం
ఆకాశవాణిలో ఆయన ప్రవేశపెట్టిన “భక్తిరంజని” కార్యక్రమము అచిరకాలంలోనే ఎంతో విజయవంతమై ఆయన పేరుకి మారుపేరు అయింది. ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు, సదాశివబ్రహ్మేంద్ర కీర్తనలు, జయదేవుని అష్టపదులు, నారాయణతీర్థ తరంగాలు, క్షేత్రయ్య పదాలు, తత్త్వాలు, అన్నమయ్య, భద్రాచల రామదాసు, స్వాతి తిరునాళ్, కైవారం అమర నారాయణ స్వామి తూము నరసింహదాసుల కీర్తనలను, అంతగా ప్రాచుర్యంలో లేని యడ్ల రామదాసు వంటివారి వైరాగ్య భక్తిరస గీతాలను స్వరపరిచి, ప్రసారం చేసి, ఇంటింటా మారుమ్రోగేలా చేసి, సామాన్యజనంలో ఆముష్మిక చింతనను పెంచి, ఇహపర సాధనకు చక్కని సోపాన మార్గాన్ని చూపించిన మహానుభావులు ఆయన. శాస్త్రీయ సంగీతపు కొమ్మల్లో ఒకటైన లలిత సంగీతానికి తెనుగునాట ఆకాశవాణి మాధ్యమం ద్వారా ఒక అద్వితీయమైన స్థానాన్నికల్పించిన మహనీయద్వయం శ్రీబాలాంత్రపు రజనీకాంతరావు గారు, శ్రీ బాలమురళీకృష్ణ గారునూ.
ఆయన రచనలలో అత్యంత పేరు తెచ్చిపెట్టినవి తిల్లానాలు. ద్విజావంతి, బృందావని, కదనకుతూహలం, అహిరిభైరవి, బేహాగ్, కుంతలవరాళి, గతిభేధప్రియ, రాయరాగమలిక మొదలైన రాగాలలో రూపొందించిన వారి తిల్లానాలు కేవలము సంగీతప్రియుల కోసమే కాదు, ఏ రీతి నృత్యవిధానానికైనా అచ్చుగుద్దినట్టుగా సరిపోయే విధంగా ఉన్నందునే, వాటిని ప్రముఖ నృత్యకారిణులు ఎందరో ఈనాటికీ తమ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన అంశంగా ప్రదర్శిస్తున్నారు.
“నగు మోము కనలేని నాజాలి తెలిసి” అని అంతులేని ఆర్తితో అభేరిలో ఆలపించి, “బంటురీతి కొలువీయవయ్యరామ”అంటూ హంసనాదంలోవేడి “ఎందరో మహానుభావులు,అందరికీ వందనములంటూ” సంగీత సరస్వతిని ‘శ్రీ’రాగంలో త్యాగరాజ పంచరత్నాలంకృతను చేసి, “వదనమదే విరిసెనే, అధరమదే మురిసెనే “ అని మురళి మధుర గానం గురించి కదనకూతుహలంలో మురిసి, ‘నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి,జనకుని కూతుర జననీ జానకమ్మా’ అంటూ ‘కల్యాణి’ రాగంలో కంచర్ల గోపన్న హృదయాన్ని కదిలించి, ‘బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానెనీ పాదమూ’ అంటూ కలియుగ దైవమైన శ్రీ వేంకటనాధునికి అన్నమయ్య స్వరార్చన సల్పి, “పిబరే రామరసం” అంటూ రామనామృతాన్ని గ్రోలి, “వస్తావట్టిదే, పోతావట్టిదే” అనే తత్త్వాన్నిసునాయాసంగా బోధించి “ఏమి సేతురా లింగా ఏమి సేతురా” అంటూ సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనతో నిర్వేదాన్ని ఒలికించి, అదే సమయంలో “మల్లెపువా, మల్లెపువా” అంటూ ఒక భావ గీతాన్ని ప్రేమమీర పాడి, నవరస భరితంగా జాలువారించి మన మనసులను అనేక రకాలుగా తాకిన గళ సమీరం వారిది.
“పాడనా వాణి కల్యాణిగా” అంటూ భారతిని పొగిడినా “సలలిత రాగ సుధారస సారం, సర్వకళామయ నాట్యవిలాసం” అని లాలిత్యంగా పాడినా “నీవూ నేనూ వలచితిమి, నందనమే ఎదురుగా చూచితిమి”’ అనే ప్రేమాతిశయముగా పలికినా , “వసంత గాలికి వలపులు రేగ “ అని ప్రణయ గీతమాలపించినా , “మౌనమె నీభాష ఓ మూగ మనసా” అని మనసు లోతులను విషాదంగా తడిమినా, “ఆది అనాదియు నీవే దేవా నారద సన్నుత నారాయణ” అని నారాయణ తత్త్వాన్ని చాటినా, “యేటిలోని కెరటాలు యేరు విడిచిపోవు” అనే తాత్విక సందేశాన్ని ఇచ్చినా, అవన్నీ ఆయన కంఠంలో ఒదిగిపోయి చలచిత్ర రంగంలో ఆ పాటలకి చిరంజీవత్త్వాన్ని కల్పించాయి.
సంగీతానికి ఆయన చేసిన ఎనలేని సేవ రికార్డింగ్స్. కొన్ని వందల రికార్డులలో, ఆడియో టేపులలో, సీడీలలో తన సంగీతాన్ని పొందుపరచి, తరగని, కరగని అమూల్యమైన సంగీతఖనిని ముందుతరాలవారికి అందించారు. సంగీత చికిత్స ద్వారా రాగాలతో రోగాలు తగ్గించడమనే ప్రక్రియ కోసం ఆయన ఎంతగానో శ్రమించారు. ఫలానా జబ్బుకు ఫలానా రాగంతో చికిత్స అని ఏమైనా కనిపెడితే, అది ప్రపంచంతో పంచుకోవచ్చని తపించారు. అందుకే మ్యూజిక్ థెరపీ మీద ప్రయోగాలు చేశారు. “మురళి రవళి” అనే సంస్థను నెలకొల్పి, దానిద్వారా ఎంతోమంది సంగీత విద్వాంసులను “నాదసుధార్ణవ” అనే బిరుదుతో సత్కరించారు, సత్కరిస్తున్నారు.
“వెనుకఁదీక తనమనసు రంజిల్లగ ఘనమైన నామ కీర్తన పరుఁడైనట్టి, ఉల్లపు తాపము చల్లజేసి యన్నికల్లలను యెంచి సల్లాపమున నుండు అతడే ధన్యుడురా” ….శ్రీ త్యాగరాజు
”మురళి సాక్షాత్తూ త్యాగరాజుల అవతారం. ఆయనదే నేటికీ మొక్కవోని మధురస్వరం” “బాలమురళిది సంగీతమూ కాదు, కర్ణాటకమూ కాదు. అదొక ఓంకారమమ్మా! అయ్యవారి (అంటే త్యాగయ్య) ప్రణవానికి ప్రతిబింబం”……శ్రీమతి బెజవాడ నాగరత్నమ్మ
“బాలమురళి శ్రీకృష్ణుని మురళి”…… శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు
“మురళి నిజముగా వినలేదు మున్నుమేము
మరల వినుచుంటి మినాడు మురళి రవము
తానుగా పిన్నయై యవతారమోత్తె
మా కొరకు గాను ప్రేమతో మరల మురళి”……శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు
“మురళి బాలమురళి
నీ గాన రవళి సోకిన జనావళి
అన్నారులే భళి భళి
నీ గుండెలో మెదలు అనుభూతులెన్నెన్నో
నీ గళములో కదలు నవరసములన్నీ
మై మరచి మరీమరీ
నీ గాన సుధగ్రోలి మూగ గొంతున కూడ ,
రేగునేవో రాగములు” …….శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారు
“ఇప్పుడాయన ఉనికి గోలోకంలో(కృష్ణగానం చేసిన వారి పరమావధి గోలోకమనే నా విశ్వాసం). అక్కడ జుగల్బందీ చేస్తే ఆ పెద్ద మురళీవాడి ముందు బాలమురళి నీడను పడతాడా అన్నది పక్కనున్న మల్లాది రామకృష్ణ శాస్త్రే నిర్ణయించాలి!”…..శ్రీ. వి. ఏ. కె. రంగరావుగారు
“ఏ వాణికి పుం భావమొ
ఈ మురళి నామధరుడు
ఏ వరాల తొలిపంటయొ
ఈ స్వరాల వన్నెకాడు” …..డాక్టర్ నారాయణ రెడ్డి గారు
“బాలమురళి మరో పేరు ‘‘భక్తిరంజని’’. బాలమురళి నిష్క్రమణ తో సరిగమల బృందావనం సద్దుమణిగింది.”….. శ్రీ శ్రీరమణ గారు
“ఇప్పుడాయన ఉనికి గోలోకంలో(కృష్ణగానం చేసిన వారి పరమావధి గోలోకమనే నా విశ్వాసం). అక్కడ జుగల్బందీ చేస్తే ఆ పెద్ద మురళీవాడి ముందు బాలమురళి నీడను పడతాడా అన్నది పక్కనున్న మల్లాది రామకృష్ణ శాస్త్రే నిర్ణయించాలి!”…..శ్రీ. వి. ఏ. కె. రంగరావుగారు
“ఉదయమే అహిర్ భైరవిలో ‘పిబరే రామరసం’ అంటే శ్రోతల హృదయాల్లో రామరసం చిప్పిల్లేది. ఆయన పాటలో, రచనలో, ఈ జన్మకే పరిమితం కాని ఉపాసనా బలమేదో కనిపిస్తుంది.”…..శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు
శ్రీ మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారి పసిడి పలుకులు
“నాకు సంగీతం తప్ప మరోకటి లేదు, తెలియదు”.
“సంగీతానికి నేనిచ్చే నిర్వచనం. లైఫ్”
“సంగీతం ఎవరో నేర్పితే వచ్చేది కాదు, అది భగవదత్తమైన కళ”.
“కళాకారుడు తన స్వీయ ప్రజ్ఞను పెంచుకోవాలి. ఏ ప్రక్క వాద్యం లేకపోయినా కళాకారుని ప్రజ్ఞ ద్విగుణీకృత మయ్యే విధంగా ఎదగాలి. గాత్ర విద్వాంసులు తమ సాహిత్యాన్ని స్పష్టంగా పాడుతూ సహకార వాద్యాలు లేకుండా కూడా కచేరీలు రక్తి కట్టించటానికి ప్రయత్నం చేయాలి. సహకార వాద్యాలు సహితం గాత్రం పాడేవారికి సహకరించాలే తప్ప పరిమితిని దాటి ప్రయోగాలు చేస్తూ సభామర్యాదను ఉల్లంఘించకూడదు”.
“జీవితంలో ఇంత దూరం ప్రయాణము చేసిన తరువాత ‘నా కనిపించిన సత్యం’ నాకు తెలిసింది చాలా తక్కువ తెలుసుకోవలసింది చాలా ఉంది”
‘‘పునర్జన్మ ఉందో, లేదో నాకు తెలియదు. కానీ, ఒకరి నుంచి మరొకరికి సంగీతం పరంపరాగతంగా రావడం లాంటి వాటిని బట్టి, మన శాస్త్రాలను బట్టి చూస్తే పునర్జన్మ ఉందనే అనుకుంటున్నా. మళ్ళీ జన్మంటూ ఉంటే, ఈసారి ‘పెద్ద’ బాల మురళీకృష్ణ లాగా, ‘కొత్త’ బాల మురళీకృష్ణ లాగా మరింత మెరుగైన పనులు చేస్తా. సంగీతానికి నాకు చేతనైనంత ఇంకా… ఇంకా చేస్తా’’
“ఆలయాల్లో నిత్య కార్యక్రమాలు ప్రారంభమయ్యే మంగళవాయిద్యాలలోను, సుప్రభాత ఉచ్ఛరణలోనూ సంగీతం ఉంది, అలాగే ఆలయ కార్యక్రమాలు ముగిసే స్వామివార్ల ఏకాంత సేవలోని గీతాలాపనలోనూ సంగీతం ఉంది. సంగీతానికి ఆలయాలకు గల సంబంధం విడదీయలేనిది”.
“భగవంతునికి గానం అంటే ఎంతో ఇష్టం, గానాన్ని వింటే ఆయనకు ఎనలేని సంతోషం కలుగుతుంది. సంగీతంలో అన్నీ రసాలు చివరికి భక్తిలో పర్వవశిస్తాయి. భక్తే చివరిగా నిలిచేది. ఇది నిత్య సత్యం సంగీతం నేర్చుకునేవారందరికీ ఇదే పరమార్థం కావాలి. సంగీతానికి ఇంత ఉదాత్తమైన ఆదర్శం మరే దేశంలోనూ, ఏ సంగీతానికి లేదని మనం ఎంతో గర్వపడొచ్చు. అందరి మాట ఎలా ఉన్నా నేను గర్వపడతాను.”
xxxxxxxxxxxxxxxxxxxxxx
Comments
Loading…